మకర రాశికి చేరు మార్తాండుడు
ఉత్తరాయణములో సంచారుడు!
నాకాలోకమ్ములో కలుగుపుణ్యగతులు
లోకాన మరణించువారికపుడు!
రైతన్న చేతిలో పులకించు సస్యాలు
వృషభ రథములపైన ఊరేగు బస్తాలు
రైతన్న గాదులను నింపు ధాన్యాలు!
పౌష్యలక్ష్మి యెవచ్చి పరుగుపరుగున
వ్రాలు !
భోగిమంటలతోడ తరుము ధైన్యాలు
ధైన్యాలతో పాటు పోవు హిమ వీచికలు!
నలుగు పిండిని బెట్టి చేయు స్నాన్నాలు
పిల్లలకు చేస్తారు భోగిపండ్లాభి షేకాలు!
చుక్కలన్నీ చేరి వాకిళ్లలో
ముగ్గులై మురిపించు సంక్రాంతిలో
చామంతి సంబరం చూడాలయా
బంతి దానితో పోటీకి దిగుతుందయా!
గొబ్బిళ్ళ పూజలో కన్నెలకు పోటీ
వాకిళ్ళు లోగిళ్ళు ఆనందవాటి !
దేవుళ్ళె దిగుతారు మూలగదిలోకి
కొత్తబట్టలు పెట్టి పూజింతురచట!
హరిదాసు రాగాలు శ్రవణాలకింపు!
బసవన్న నాట్యాలు అవి కనులకింపు !
వేకువను వినిపించుబుడబుడక్కల గోల!
జంగమ దేవరుల దీవెనల హేల!
ఆడపిల్లలకు దక్కు గౌరవం పుట్టింట
అల్లుళ్ళకో టెక్కు అత్తమామల ఇంట!
పిండివంటలు ముక్కు పుటలదరగొట్టు !
పాడిపంటలు సంక్రాంతి లక్ష్మి
తెచ్చి పెట్టు!
కనుమ పండుగరోజు పశుపూజ రోజు
పశుపు కుంకుమ పెట్టి దండాలు పెట్టి
కొమ్ములకు తైలమ్ము పూస్తారయా!
మూడు రోజుల పండుగను ముగిస్తారయా!
*రచన : కిలపర్తి దాలినాయుడు*